టీఎంసీ నేత(TMC Leader) మహువా మొయిత్రా(Mahua Moitra) ఇటీవల పార్లమెంట్(Parliament) నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బు తీసుకుని దోషిగా తేలడంతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. తర్వాత, మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని అనేక సార్లు నోటీసులు అందుకున్నారు.
అయినా ఆమె బంగ్లాను ఖాళీ చేయలేదు. అయితే, తాజాగా మహువాకు మరో సారి నోటీసు అందుకున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయకుంటే బలవంతంగా బంగ్లాను ఖాళీ చేయిస్తామని ఆ నోటీసులో అల్టిమేటం జారీ చేశారు. ఇంత జరుగుతున్నా ఆమె ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం లేదు.
నోటీసు ప్రకారం, ఆమె పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఈ బంగ్లాకు అర్హురాలు కాదు. అందువల్ల ఆమె 9B టెలిగ్రాఫ్ లేన్‌లోని టైప్ 5 బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. సభ్యత్వం కోసం ఒక నెల గడువు ముగిసిన తర్వాత జనవరి 7న అలాట్మెంట్ రద్దు చేయబడింది. బంగ్లాను ఖాళీ చేసేందుకు నిబంధనల ప్రకారం నెల రోజుల గడువు ఇచ్చారు.
సవరించిన చట్టం ప్రకారం, ప్రభుత్వ వసతి గృహాల నుంచి అనధికార వ్యక్తులను తొలగించడానికి మూడు రోజుల ముందు ఎస్టేట్ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 60 రోజులు. అయితే ఈలోగా కోర్టును కూడా ఆశ్రయించినా అక్కడి నుంచి కూడా ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో ఆమె బంగ్లాను ఖాళీ చేయడంలేదని అధికారులు తదుపరి చర్యలను ముమ్మరం చేశారు.