– మరోసారి తెరపైకి మూసీ ప్రక్షాళన అంశం
– లండన్ లోని థేమ్స్ నది పరిశీలించిన సీఎం
– నిర్వహణపై అక్కడి అధికారులతో భేటీ
– లండన్ పోర్టు అధికారులతోనూ సమావేశం
– త్వరలోనే నగరానికి నిపుణుల బృందం
– మూడున్నర గంటలపాటు రోడ్ మ్యాప్ పై చర్చ
– మూసీ ప్రక్షాళన మంత్రం అందుకున్న రేవంత్
– గతంలో సబర్మతి నదిలా చేస్తామన్న కేసీఆర్ సర్కార్
– చివరకు చేతులెత్తేసి పరార్
– అసలు, మూసీ ప్రక్షాళన సాధ్యమేనా?
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. లండన్ లో థేమ్స్ (Thames) రివర్ అథారిటీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం అయ్యారు. నది నిర్వహణకు సంబంధించిన పలు విషయాలను అథారిటీ నుంచి తెలుసుకున్నారు. దావోస్ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా లండన్ వెళ్లారు. అక్కడ థేమ్స్ రివర్ అథారిటీతో సుమారు మూడున్నర గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు.
మూసీ నది పునరుజ్జీవన విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ఈ సందర్భంగా థేమ్స్ రివర్ అథారిటీకి వివరించారు. థేమ్స్ నదిని పలు దశల్లో అభివృద్ధి చేసినట్టుగానే మూసీ నదిని డెవలప్ చేసే విషయంలో సహకరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన కోరారు.
థేమ్స్ నది వెంట చేపట్టిన అభివృద్ధి పనుల గురించి డైరెక్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సియాన్ ఫాస్టర్, పోర్టు లండన్ అథారిటీ అధికారి రాజ్ కెహల్ సమగ్రంగా రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనేక నగరాలు నాగరికతలు నదీ తీర ప్రాంతంలోనే అభివృద్ధి చెందాయని తెలిపారు.
పట్టణాల్లో మానవ ఆవాసాలను శక్తివంతం చేయడంతో నదీ ప్రాంతాలు జీవనాధార శక్తులని వెల్లడించారు. హైదరాబాద్ కూడా దానికి అతీతం కాదని వివరించారు. త్వరలోనే లండన్ నుంచి నిపుణుల బృందం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయనుంది.
దీంతో పాటు మూసీ ప్రక్షాళన ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించనుంది. అయితే.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగే మూసీ ప్రక్షాళన మంత్రం జపించింది. చివరకు ఏం చేయలేక చేతులెత్తేసింది. మాటలకే పరిమితమైందనే విమర్శలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టడంతో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే.. ఇది సాధ్యమయ్యేదేనా? అనే చర్చ కూడా జరుగుతోంది.