అయోధ్య(Ayodhya)లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రారంభోత్సవానికి యావత్ దేశమే కాదు, ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ(Telangana)లోనూ రేపు(సోమవారం) విద్యాసంస్థలకు సెలవు(Holiday) ప్రకటించాలని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీనివాస్ పిటిషన్లో కోరారు. ఇదిలా ఉండగా ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జనవరి 22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు.
ఏపీలోనూ సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని.. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు హర్యానా, ఛత్తీస్ గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఒంటిపూట సెలవును అధికారికంగా సెలవు ప్రకటించారు.