రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) మాటలు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తరచుగా కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.. రాష్ట్ర ప్రజలు ఎప్పుడో కేసీఆర్ ను మరచిపోయారని తెలిపారు.. ఓడిపోతే ఫామ్ హౌస్ లో ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు.. మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు..
సూర్యాపేట (Suryapet) జిల్లా జాన్ పాడ్ దర్గా ఉర్స్ లో పాల్గొన్న ఉత్తమ్ కుమార్.. స్వామివారికి గంధం సమర్పించారు. ఈ ఊర్స్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. సాగర్ డ్యాంలో నీరు తక్కువ ఉంది.. ఈసారి వర్షాలు సంవృద్దిగా పడాలని దర్గాలో ప్రార్థనలు చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసిన అభివృధి శూన్యమని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టీ.. నిధులు దోచుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ నేతలు డబ్బులు దుర్వినియోగం చేశారని ఆరోపించిన ఉత్తమ్.. ఇది సక్సస్ అయితే కృష్ట నది ఒడ్డున ఉన్న గ్రామాలకు తాగు నీరు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్ళూ అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు మీ పక్షాన ఉంటే ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందని అడిగారు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక బై బై కేసీఆర్ (KCR).. బై బై కేటీఆర్ (KTR) ఇదే రాసి పెట్టుకోండంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వకుండా 90 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించిన ఉత్తమ్ కుమార్.. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించానని తెలిపారు.