రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన చాలా పథకాల పేరు మార్చి అమలు చేసేందుకు రెడీ అయిన ప్రభుత్వం.. ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం. అయ్యో తొందరపడి అపార్థం చేసుకోకండి. తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నెంబర్ ప్లేట్లపై టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి విడిపోయి.. తెలంగాణ (Telangana) రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. తెలంగాణ స్టేట్ అని వచ్చేలా TS అని షార్ట్ ఫాంలో ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్లపైనే కాకుండా.. అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి.
అయితే.. టీఎస్ అనే షార్ట్ ఫాంను.. టీజీ (TG) గా మార్చనున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశానికి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. మరోవైపు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం, కేవలం నెంబర్ ప్లేట్లు మాత్రమే కాదు.. చాలా మార్చాల్చి వస్తుంది. ఈ క్రమంలో కేవలం నెంబర్ ప్లేట్ల మీదే మారుస్తారా.. లేదా మొత్తం మారుస్తారా అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర అంశంగా మారింది.
మరోవైపు కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ముఖ్యంగా చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈసారి మరో రెండు పథకాలను అమలుపరిచే దిశగా ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని.. 9న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని రాజకీయ వర్గాలలో చర్చించుకొంటున్నారు.