వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ముందుకెళ్తున్నారు. ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత కొండగట్టు అంజన్న సన్నిధికి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం.. మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు.
ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు బండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు పొంతనే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా బీసీలను మోసం చేసిందన్నారు. బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారని.. వారు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరం అని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్ తో ఇచ్చిన హామీలు నెరవేర్చలేమని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదని.. ఇక వాళ్లు మారరని విమర్శించారు. వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని విమర్శించారు. ‘‘నేను హిందూవునేనని.. హిందూ ధర్మ గురించే చెప్తాను. వినోద్ కుమార్ దేవుణ్ణి నమ్మరు..నాస్తికుడు’’ అని బండి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు కళ్లు కనబడటం లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు దోచి పెట్టడానికే వినోద్ గతంలో ఎంపీ అయ్యారని విమర్శించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కాళేశ్వరంలో వినోద్ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లు కాదా అని ప్రశ్నించారు. వినోద్ ఎంపీగా ఉండి కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వినోద్ ది కరీంనగర్ కాదని.. తనది పక్కా లోకల్ అని తెలిపారు బండి. సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి దశ పాదయాత్రను ప్రారంభించిన బండి.. మొదటి దశ యాత్ర ఈనెల 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.