తనను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ అన్నాడీఎంకే మాజీ నేత (ex AIADMK leader) ఏవీ రాజు (AV Raju)పై ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) చర్యలు తీసుకుంది. ఈ మేరకు పరువు నష్టం కేసు (Defamation case) పెట్టింది. తన లాయర్ ద్వారా ఏవీ రాజుకు లీగల్ నోటీసులు పంపింది.
ఈ విషయాన్ని త్రిష గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు లీగల్ నోటీసుల ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంది. కాగా, అన్నాడీఎంకే తమిళనాడు ఏఐఏడీఎంకే నేత ఏవీ రాజుకీ, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జీ వెంకటాచలానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏవీ రాజు.. వెంకటాచలాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తూ మధ్యలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరును ప్రస్తావించాడు.
అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై త్రిష సైతం మండిపడింది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారతారా? ఇలాంటి నీచమైన మనుషులను మళ్లీ మళ్లీ చూడడం మరింత ఘోరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
తన ఓపిక నశించిందని.. ఇక అలాంటి వ్యక్తులను క్షమించననని.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచే సమాధానం వస్తుందంటూ హెచ్చరించింది. ఏవీ రాజు మాత్రం తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని కోరారు. త్రిష ప్రస్తుతం 18ఏళ్ల తర్వాత చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
— Trish (@trishtrashers) February 22, 2024