లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య డైలాగ్ వార్ ముదిరిపోతుంది. చేవెళ్లలో ఇటీవల నిర్వహించిన జనజాతర బహిరంగసభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ సైతం సీఎంకి ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరం కలిసి మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పోటీ చేద్దామంటూ ఛాలెంజ్ చేశారు..
లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు.. అందుకే ఇద్దరం కలిసి ఒకే సీటు కోసం మల్కాజిగిరి (Malkajigiri) నుంచి పోటీ చేద్దామని తెలిపారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యే, సీఎం పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.సేఫ్ గేమ్ అక్కర్లేదని తెలిపిన కేటీఆర్.. సీఎం ఐడెంటిటి క్రైసిస్తో బాధపడుతున్నారంటూ సెటైర్లు వేశారు.
నేనే సీఎం, నేనే టీపీసీసీ అని అరుస్తున్న రేవంత్.. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, బీసీ ప్లాన్ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మా మీద వచ్చిన ఆరోపణలు అబద్దమని నిరూపించుకోవడానికి మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పేరుతో సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు మేడిగడ్డ రిపేర్లు చేయమంటే చేయట్లేదని ఆరోపించారు.
రిపేర్ చేసి మార్చి 31 లోపు నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. రాజకీయంగా వేధింపులు చేయాలంటే చేయండి.. మేము దేనికి భయపడమని తెలిపిన కేటీఆర్.. కాళేశ్వరంకు 400 అనుమతులు వచ్చాయన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చురకలు అంటించారు. మీరు అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించి మాట్లాడాలని సూచించారు.