లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతల నుంచి వరాల జల్లులు కురుస్తున్నాయి.. ఇచ్చిన హామీలు త్వరగా పూర్తి చేయాలనే ఆరాటం.. చేసిన అభివృద్ధి.. చేయబోయే అభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రచారాల్లో వేగం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ (BJP) మూడో సారి అధికారం చేపట్టే ఆలోచనలో భాగంగా ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ (Cantonment) పరిధిలోని 175 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్‌ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఒకటో నెంబర్, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఎలివేటేటడ్ కారిడార్లు, టన్నెళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని భావిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi)కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad)లో పౌర విమానయాన పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్థను ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో 4, 5 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి. ఈమేరకు మార్చ 5వ తేదీన ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నారు..