ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో అధికార కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections)పై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు గత కొన్ని రోజులుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన గవర్నర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సాధారణ కార్యకర్తనని.. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేశానని తెలిపారు.
భవిష్యత్‌లో కూడా తనపై నమ్మకంతో ఏ బాధ్యతలు అప్పగించిన తప్పక నిర్వర్తిస్తానని స్పష్టం చేసిన తమిళి సై.. దేవుడు కరుణించి, బీజేపీ హై కమాండ్ అవకాశమిస్తే చూద్దామని అన్నారు.. మరోవైపు గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గవర్నర్ ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమెను గెలుపు పలకరించలేదు.
అయితే పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఇదిలా ఉండగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకొంది. దక్షిణ భారతదేశంలో గతంలో కన్నా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్‌గా తనదైన ముద్ర వేసుకొన్న తమిళి సై (Governor Tamili Sai)ని పార్లమెంట్ బరిలోకి దించాలనే ప్లాన్ లో బీజేపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా గత బీఆర్ఎస్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అనే తీరులో వ్యవహరించి తమిళి సై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సైని ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి మరోసారి పోటీలో నిలపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పొలిటికల్ ఎంట్రీకి క్లియర్ అనే సూచనలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు..