వేసవి ఎంట్రీ ఇచ్చింది. మండే ఎండలకు తోడు ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అదీగాక పట్టణంలో అగ్నిప్రమాదాలకు ఒక సమయం అంటూ లేదు. కానీ వేసవిలో మాత్రం ఈ ఘటనలు పెరిగే అవకాశాలున్నట్లు ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అందులో గత సంవత్సరం నుంచి భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కనిపిస్తున్నది..
మరోవైపు నేటి ఉదయం నాచారం (Nacharam) పారిశ్రామిక వాడాలో భారీ అగ్నిప్రమాదం (Fire Hazard) సంభవించింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కెమికల్ మెటీరియల్ ఎక్కువ ఉండడంతో భారీగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం..
ఈ నేపథ్యంలో ఫైరింజన్ తో మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు (Nageshwar Rao) మాట్లాడుతూ.. గోడౌన్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తుందా లేదా అనేది విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఒకవేళ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.. ఇదిలా ఉండగా నగరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో (Industrial Area) ఎండల వేడికి ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.. అందువల్ల ప్రమాదం జరిగాక చర్యలు చేపట్టే బదులు.. ప్రమాదాల నివారణపై అవగహాన కలిగిస్తూ.. ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు..