Telugu News » Telangana : ఎన్నాళ్ళు ఎదురు చూపులు.. న్యాయం కోసం ప్ర‌జా భ‌వ‌న్‌కు డీఎస్సీ బాధితులు..!

Telangana : ఎన్నాళ్ళు ఎదురు చూపులు.. న్యాయం కోసం ప్ర‌జా భ‌వ‌న్‌కు డీఎస్సీ బాధితులు..!

రాష్ట్ర హైకోర్టు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం గతంలో హామీ ఇచ్చారని తెలిపారు.

by Venu
Praja Bhavan as residence of Dy CM Bhatti Vikramarka

రాష్ట్రంలో డీఎస్సీ (DSC) 2008 బాధితుల కష్టాలు ఇంకా తీరడం లేదు.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ ఆవేదన ఇలాగే కొనసాగుతున్నాయని కన్నీళ్ళు పెట్టుకొంటున్న బాధితులు నేడు ప్ర‌జా భ‌వ‌న్‌ (Praja Bhavan)కు భారీగా త‌ర‌లివ‌చ్చారు. త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు రాష్ట్రం నలుమూలల నుంచి త‌ర‌లివ‌చ్చారు.

DSC Aspirants Protest At Indira Park Against Govt To Release Notification

రాష్ట్ర హైకోర్టు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం గతంలో హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి.. వారి జీవితాల్లో వెలుగు నింపిందని పేర్కొన్న బాధితులు.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల కన్నీళ్లను తుడవాలని కోరారు.

ఈ అంశంపై సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.. ఇదిలా ఉండగా.. 2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ (BED), డీఈడీ (DED)అభ్యర్థులు అర్హులని పేర్కొంది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ను తీసుకొచ్చింది.

అయితే ఈ విషయంలో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇదే ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

ఆతర్వాత జరిగిన సంఘటనల వల్ల అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు.

అయితే 2013 జూలై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే న్యాయం చేస్తామని చెప్పి ఇందిరా పార్కులో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. దీంతో అలసిపోయిన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment