తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ, డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు (Dugyala Praneeth Rao)ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చట్ట విరుద్దమైన చర్యలకు పాలడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా ఈ అంశంలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ (Congress) సహా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టారు..
అప్పటి అధికార పార్టీకి దాసోహమైన ప్రణీత్ రావు.. ఎస్ఐబీ (SIB) ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేసినట్లు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. మరోవైపు హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్ సైతం ధ్వంసం చేసినట్లు తేల్చారు.
అదేవిధంగా డేటాబేస్‌లోని మొత్తం డేటాను రిమూవ్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ధ్వంసం చేసినట్లు తేల్చారు.. ఇక గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు.. దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో.. నిన్న సస్పెన్షన్ వేటు పడింది.
ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలతో పాటు, మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.. ఇదే సమయంలో మరోసారి రాష్ట్రంలో భారీగా పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు చోటు చేసుకొన్నాయి.
ఒకేసారి 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ, డీజీపీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. ఒక పార్లమెంట్ పరిధిలో, గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారని సమాచారం..