బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను(Farmers), నేతన్నల (Handloom Worker) ను ఆదుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వం వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామని కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో మంజూరైన ముస్తాబాద్ రోడ్డును కాంగ్రెస్ రద్దు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు ఏం చేతకాదని ఎద్దేవా చేశారు.
మరోవైపు కరీంనగర్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. మతం పేరుతో ఓట్లు అడగటం తప్ప సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు. అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ఫైర్ అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్‌లో ‘కదన భేరీ’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే బస్సు యాత్రలు, రోడ్డు షోలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎల్ఆర్‌ఎస్‌పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఎల్ఆర్‌ఎస్‌పై నిరసన తెలపాలన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. డిసెంబరు 9న అన్ని హామీలు నెరవేరుస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు.