– సాహితీ లావాదేవీలపై పోలీసుల దృష్టి
– వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లలో సోదాలు
– ఏకకాలంలో తనిఖీలకు దిగిన ఖాకీలు
– మరి, ఫినిక్స్ సంగతేంటి..?
– ఆంటోనీ రెడ్డి, కొడాలి శ్రీనివాస్ తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి?
– ఆ లెక్కలు కూడా బయటకు తీస్తారా..?
– సాహితీ లావాదేవీలపై ఆధారాలతో సహా ముందే బయటపెట్టిన ‘రాష్ట్ర’
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు అయింది. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు గత పాలకుల పాపాల పుట్ట పగలడం ఖాయం. ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తోంది అదే. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలోనే సాహితీ ఇన్ఫ్రా లెక్కలు బయటకు తీస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం నగరంలో పోలీసులు సోదాలకు దిగారు. సాహితీ సంస్థ నుంచి బయటకు వెళ్లిన డబ్బు సంచుల ఆధారంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ సోదాలు ఫినిక్స్ వరకు వెళ్తాయా? లేదా? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.
వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
వందల మందిని ముంచేసి వేల కోట్లు కోట్టేసి దర్జాగా బయట తిరుగుతున్నాడు సాహితీ ఇన్ఫ్రా ఓనర్ బూదాటి లక్ష్మీనారాయణ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు నాయకుల నుంచి అధికారుల దాకా అందర్నీ ఇన్వాల్వ్ చేసి భారీగా దోచేశాడు. ఆ డబ్బంతా తన ఇష్టానికి వాడుకున్నాడు. తెలిసిన వాళ్లతో ఉన్న డీలింగ్స్ ను బట్టి అడిగినంత ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే వినోద్ కెడియాకు 45.97 కోట్లు, సునీల్ అహుజాకు 11.87 కోట్లు అప్పగించాడు. ఈ లెక్కలన్నీ ‘రాష్ట్ర’ గతంలోనే ఆధారాలతో సహా బయటపెట్టింది. వాటి ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఆదర్శ్ నగర్ లోని వినోద్ కెడియా ఇళ్లు, బహుదూర్ పుర క్రాస్ రోడ్డులోని ఆఫీసులో సోదాలకు దిగారు. అలాగే, బంజారాహిల్స్ నవీన్ నగర్ లోని సునీల్ అహుజా ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. వీరితోపాటు ఆశిష్ కుమార్ అహుజా, రక్షిత్ అగర్వాల్, కమల్ కుమార్ జైన్ ఇళ్లపైనా పోలీసులు దాడులకు దిగారు.
ప్రీలాంచుల పేరుతో జనం నుంచి వేల కోట్లు లాగేసి.. పెళ్లిళ్లు, పేరంటాలు, పబ్స్, పార్టీలతోపాటు నాయకులకు ఇచ్చిన కమీషన్స్ కు అధికంగా ఖర్చు చేశాడు బూదాటి. ఈ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగినా.. సరిగ్గా దర్యాప్తు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లక్ష్మీనారాయణతో లింక్స్ ఉన్న బడా కంపెనీలను టచ్ చేయడం లేదని బాధితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు తీసుకున్న వినోద్ కెడియా, సునీల్ అహుజాలపై చర్యలు తీసుకున్నది లేదని.. దాదాపు 13 వందల కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్ మెంట్లలో ఎన్నో లింకులు ఉన్నా వాటిపై దృష్టి సారించలేదని అంటున్నారు. గ్రీన్ మెట్రో అశోక్ కు 15 కోట్లు, శ్రీనిధి శ్రీహరికి 15 కోట్లు, షిబా ఇన్ఫ్రా టెక్ కి 8 కోట్లు, తన కూతురుకి 2 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడు బూదాటి. అలాగే, ఫినిక్స్ పేరు మీద ఒక్క ఎకరా లేకుండానే డబ్బులు చేతులు మారాయి. ఆ కంపెనీకి 80 కోట్లు వైట్ లో ట్రాన్స్ ఫర్ చేసి కేవలం 15 కోట్లకే కొన్నట్టు చూపాడు. 65 కోట్లు ఏమయ్యాయనేది ఇప్పటికీ తేలలేదు. కవిత బినామీగా భావించే కంపెనీ డైరెక్టర్ ఆంటోనీ రెడ్డికి 8 కోట్లు వెళ్లాయి. మరో డైరెక్టర్ కొడాలి శ్రీనివాస్ కు 7 కోట్లు చేరాయి. ఇతను అరికెపూడి గాంధీకి బినామీ అనే విమర్శలున్నాయి. అలాగే, మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ కు 10 కోట్లు, ఇంకో డైరెక్టర్ ప్రహ్లాద్ కు 2 కోట్లు ఇచ్చాడు బూదాటి.
ఫినిక్స్ ను టచ్ చేస్తారా?
సాహితీ నుంచి ఎక్కువ మొత్తంలో లాభపడింది ఫినిక్స్ సంస్థే అని ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సంస్థ ఆడిందే ఆటగా సాగింది. ప్రభుత్వ పెద్దలు ఇందులో పెట్టుబడులు పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే.. వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీల నేపథ్యంలో ఫినిక్స్ ను టచ్ చేస్తారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గత పాలనలోని అక్రమాలను బయటకు తీసుకొస్తామని చెబుతున్న రేవంత్.. సాహితీ వ్యవహారంలో ఫినిక్స్ లింకులపై దృష్టి పెడతారా..? వినోద్ కెడియా, సునీల్ అహుజా ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీల మాదిరిగానే ఫినిక్స్ ఆఫీసులు, నిర్వాహకుల ఇళ్లలో సోదాలు జరిపిస్తారా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అలాగే, కంపెనీ డైరెక్టర్స్ ని వదిలిపెట్టి మార్కెటింగ్ టీమ్ మీద కేసుని డైవర్ట్ చేసిన తీరుపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు బాధితులు. కంపెనీ నుండి వందల కోట్లు తరలించుకుపోయిన వాటా దారులు, పది రూపాయలు వడ్డీ చొప్పున వసూలు చేసి కోట్ల రూపాయలు తీసుకున్న వినోద్ కెడియా, సునీల్ అహుజా మీద యాక్షన్ తీసుకోవాలని.. పోలీసులు కానీ ఈడీ కానీ వీళ్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసి కస్టమర్స్ కి న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు బాధితులు.