లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. తెలంగాణ (Telangana)లో రాజకీయం హీటెక్కింది. మూడు ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా రాష్ట్ర పర్యటనలు చేయనున్నారు.
ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) రేపు రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఈ నెల 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ (Modi) సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 16, 18, 19 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ప్రధాని ఈ మూడు రోజులు పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది.. జగిత్యాలలో, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో ప్రధాని మోడీ సభలకు స్టేట్ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలం.. అన్ని పార్లమెంట్ స్థానాలను టచ్ చేసేలా మూడు లోక్ సభ స్థానాలను కవర్ చేస్తూ ఒక్కో సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది. మొత్తానికి లోక్ సభ ఎన్నికలు సైతం సమారాన్ని తలపించేలా సాగుతాయని అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య వార్ జోరుగా సాగనుందని చర్చించుకొంటున్నారు..