Telugu News » Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్..!

Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్..!

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేశాడు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, ప్రజాసంఘాల, జర్నలిస్టుల కీలక సమాచారం, ఫోన్లు ట్యాప్ చేసి సేకరించిన సమాచారాన్ని ఎస్ఐబీ లాగర్లో భద్రపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

by Venu

తెలంగాణ (Telangana)లో సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఈ మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) అదనపు ఎస్పీ (SP) డి.రమేశ్ ఫిర్యాదు మేరకు ప్రణీత్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో సిరిసిల్ల (Sircilla) పోలీసు క్వార్టర్స్‌లో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు ఎస్ఐబీ విభాగంలో కీలక పోస్టులో ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేశాడు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, ప్రజాసంఘాల, జర్నలిస్టుల కీలక సమాచారం, ఫోన్లు ట్యాప్ చేసి సేకరించిన సమాచారాన్ని ఎస్ఐబీ లాగర్లో భద్రపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రికార్డులు, ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో పాటు డాక్యుమెంట్లను తగులబెట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పనులకు ఎలక్ట్రిషియన్ సాయం తీసుకొన్న ప్రణీత్ రావు ( Praneeth Rao).. సీసీటీవీలను ఆపేసి ఆధారాలను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ మేరకు వారం క్రితం ఆయనపై కేసులు నమోదు కాగా.. డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది.

ఈ వ్యవహారంలో బాధ్యులైన ఇతరులపై కూడా కేసులు నమోదు చేసిన అధికారులు ఐపీసీ సెక్షన్లతో పాటు, ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం (PDPP), సమాచార సాంకేతిక (IT) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రణీత్‌రావుపై కేసు నమోదు చేశారు. మరోవైపు 2007 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలలో ప్రణీత్ రావు ఒక్కరే డీఎస్పీగా ప్రమోషన్ పొందటం పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment