ప్రభుత్వ రంగ సంస్థలను టీ కాంగ్రెస్ కాపాడుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో టీఎస్ఆర్టీసీ ఎండీ(TSRTC MD) సజ్జనార్(Sajjanar), ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 50శాతం ఎరియర్ బాండ్స్‌ను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం చాలా ఇబ్బంది పడేవారని, ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఎన్నారని, ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సాయం అందుతూనే ఉంటుందన్నారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధి కృషికి చూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి చెందుతోందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 75 ఎలక్ట్రిక్ బస్సులున్నాయని తెలిపారు. 22 ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు జూన్ వరకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిన అవసరముందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి, ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. గ్రామాల్లో బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. బస్సులు లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.