తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఆరు హామీల పై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
అయితే ఈ పథకాల అమలుకు రేషన్ కార్డులే ప్రామాణికం కావడంతో.. రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ప్రస్తుతం అవి ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూస్తున్నారు.. కాగా వారందరికీ త్వరలో రేషన్ కార్డులు అందుతాయని అధికారులు శుభవార్త అందించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది ఆరు హామీ పథకాలకు దూరమవుతున్నారు.
మరోవైపు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 20 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అందరికీ కాకుండా అర్హులైన వారికే ఆహార భద్రత కార్డులు అందేలా చర్యలు తీసుకొంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి పరిశీలన, ఫిజికల్ వెరిఫికేషన్ అనంతరం అర్హులుగా తేలిన వారికి రేషన్‌కార్డులు అందజేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా ప్రజల నుంచి ఇటీవల వచ్చిన దరఖాస్తులను సేకరించి నంబర్లు వేస్తారు. సంబంధిత MMARO లేదా అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారికి వివరాలు ఇవ్వబడతాయి. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. కాగా దరఖాస్తుదారు తెలంగాణ వారై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. సొంత కారు, బంగ్లా మొదలైనవి ఉండకూడదని తెలిపారు..
అదీగాక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులుగా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.. ఇక సేకరించిన వివరాలతో పాటు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి వారి ఆర్థిక స్థితి, జీవనశైలిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత… అతడు/ఆమె రేషన్ కార్డుకు అర్హులా కాదా? అని నిర్ణయిస్తారని తెలుపుతున్నారు. ఇక దరఖాస్తుదారు ఇచ్చిన సమాచారం ఏదైనా బోగస్ అని తేలితే రేషన్ కార్డు మంజూరు ఆగిపోతుందని పేర్కొన్నారు..