తెలంగాణ (Telangana) బాష, యాసకు కేరాఫ్ గా మారిన కేసీఆర్ (KCR).. ఈ భాషను రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉపయోగించారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు నచ్చిన తీరుగా మాట్లాడి.. ఈయన మన మనిషి అనే ప్లాన్ లో భాగంగా.. గులాబీ బాస్.. నిత్యం తెలంగాణ యాసతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. అయితే ఆ భాష ప్రయోగంలో అహంకారం కనిపించేదనే విమర్శలున్నాయి..
ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో మూలిగే నక్క మీద తాడిపండు పడినట్లు.. పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ (BRS) సర్కార్ తప్పిదాలు ప్రస్తుతం ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. కలుగులో ఉన్న ఎలుకకు పొగబెట్టి ఊపిరి ఆడకుండా చేసినట్లు.. రేవంత్ సర్కార్.. గులాబీ పార్టీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని.. ఇది రాజకీయ కక్షలా కాకుండా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలా ప్రజలు అనుకునే విధంగా ముందుకు వెళ్తుందని విశ్లేషిస్తున్నారు..
అదీగాక ప్రణీత రావు వ్యవహారం పూర్తిగా ఒక పెద్దమనిషి అండతో జరిగిందనే చర్చలు రాజకీయ వర్గాలలో మొదలైయ్యాయి. వీటి ఆధారంగా కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తన విమర్శలకు పదునుపెట్టడంతో గులాబీ బాస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో తన ధోరణి, ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగించిన భాష అన్ని కన్వీనియెంట్ గా మరచిపోయి.. కరీంనగర్ (Karimnagar) సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాల్సిన భాషేనా అది అంటూ రేవంత్ పద ప్రయోగంపై అమాయకంగా ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని అనుకొంటున్నారు..
బాసు పదేళ్ళ పాలనలో మీరు నేర్పిన భాషే కదా.. నదులకు నడకలు నేర్పినట్లు.. రాజకీయాల్లో వాడే భాషకు, పద ప్రయోగాలకు పుట్టినిల్లు మీరుగాక ఇంకెవరని అనుకునేలా.. రేవంత్ కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారనీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడైనా ఇటువంటి అనుచిత భాష ఉపయోగించానా అంటూ అమాయకంగా వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజలు అమాయకులు అనే భావనతో ఇంకా నా ఆటలు సాగుతాయని అనుకుంటున్నారనే విమర్శలు మొదలైయ్యాయి.
ఇదే సమయంలో కాకా ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్న కాంగ్రెస్ వెంటనే అలర్ట్ అయి గతంలో కేసీఆర్ అనుచిత భాషా ప్రయోగంతో చేసిన ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. దీంతో కేసీఆర్ అనివార్యంగా మౌనం వహించాల్సివచ్చింది. మొత్తం మీద కేసీఆర్ భాషనే ఆయన మీద ప్రయోగించి రేవంత్ (Revanth)పై చేయి సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.