పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) దానం నాగేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి శుక్రవారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఆయన పలుమార్లు సమావేశమైన చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 2009, 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల్లో నిరుత్సాహం మొదలైంది. అప్పటి నుంచి కొందరు నేతలు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కొందరు బీఆర్ఎస్ నేతలు టికెట్ లేదని తెలిసి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. వారు నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.