రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో పార్టీలు దూకుడు పెంచాయి. కానీ ఇప్పటికి ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కలు తెలలేదు.. దీనికి కారణం ఇక్కడి స్థానాల్లో రెండు పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య బాహూ బలి రేంజ్ లో ఉండటం కారణంగా తెలుపుతున్నారు.. అందుకే ఖమ్మం అభ్యర్థి ప్రకటనలో ఎడతెగని జాప్యం తప్పడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఖమ్మం (Khammam) నుంచి ముగ్గురు మంత్రుల కుటుంబీకులు ఈసారి రాజకీయ అరంగేంట్రం చేయాలన్న లక్ష్యంతో సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇక సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలుపుకోడమే లక్ష్యంగా ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) సైతం క్షేత్రస్థాయిలో ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకాల్సి ఉంది. ఈ క్రమంలో ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపిక అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో వేడి పుట్టిస్తోంది.
అదీగాక ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎవరికి వారే రాజకీయంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమకంటే తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ముగ్గురికి తోడు వీవీసీ ట్రస్టు అధినేత వంకాయల పాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఖమ్మం నుంచి బరిలో దిగితే పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అన్నచందంగా ఉంటుందని భావిస్తున్న వీహెచ్, కుసుమకుమార్ వంటి సీనియర్ నేతలు సైతం ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
ఇలా పార్టీ టికెట్ దక్కించుకోవడానికి ఎవరికి వారే ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం, జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేయడంతో కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపిక కేంద్ర ఎన్నికల కమిటీకి సైతం కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే మూడు సార్లు సమావేశమై చాలా వరకు స్థానాల్లో అభ్యర్థుల (Candidates) ఎంపిక కొలిక్కి తెచ్చినప్పటికీ ఖమ్మం బరిలో నిలిపే గెలుపు గుర్రం ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది.
మరోవైపు ఎలాగైనా ఈసారి ఖమ్మం లోక్ సభ స్థానంలో సత్తా చాటాలన్న లక్ష్యంతో కమలదళం పావులు కదుపుతోంది. ముఖ్యనేతలు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్‌రావు ఎవరికి వారే టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ నేత జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీ (BJP) గూటికి చేరడంతో ఆయనకు టికెట్ ఖాయమన్న ప్రచారం మొదలైంది. ఇలా ఖమ్మం రాజకీయాలు కాకా పుట్టిస్తున్నాయి..