గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ కేసులో కీలకమైన ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు (Praneeth Rao)ను ఈరోజు పంజాగుట్ట (Panjagutta) పోలీసుల కస్టడీలోకి తీసుకొన్నారు.
కాగా పోలీసులు పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీ కోరగా నాంపల్లి (Nampalli) కోర్టు, ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ప్రణీత్‌రావును పోలీసు కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రనీత్రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి.
ఆయనకు అప్పగించిన పనినే కాకుండా.. ఇతరుల ప్రొఫైళ్లను కూడా రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రణీత్‌రావు పెన్‌డ్రైవ్‌లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపొర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావును విచారించేందుకు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మొదట వైద్య పరీక్షల కోసం చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లారు. అనంతరం విచారణకు తరలించారు. ప్రస్తుతం పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకెవరున్నారు.. ఏవరు చేయమంటే చేశారు.. ఆధారాలు ఎందుకు ధ్వంసం చేయాల్సిన వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ తెలుసుకొన్న సమాచారం అనంతరం ఈ కేసులో మరింతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.