ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై, ఎక్స్ (X) వేదికగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఢిల్లీ (Delhi) పెద్దల చుట్టూ తిరగడమేనా మీ పని ? అని ప్రశ్నించారు. అన్నదాతల ఆర్తనాదాలు వినకుండా.. కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేకుండా వ్యవహరించడం తగదని సూచించారు..
నిన్నటి వరకు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. ఇవాళ వడగండ్ల వానలు పంటలను దెబ్బతీసినా నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు.. ఎన్నికల గోల తప్ప.. రైతులపై కనికరం లేదా?.. సీట్ల, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ఆదుకోరా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పదవులపై ఉన్న ధ్యాస రైతులపై లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు..
ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా ?.. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై లేదెందుకు అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ట్వీట్‌కు అనుబంధంగా పంట నష్టపోయి కన్నీరు పెట్టుకున్న ఓ రైతు వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు.. బీఆర్ఎస్ పార్టీ పేరుకు కొత్త అర్థం తెలిపిన ఆయన.. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత ‘రైతు’ సమితి పోరాడుతూనే ఉంటదని పేర్కొన్నారు.
ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..! ఇప్పుడు..నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని ప్రభుత్వం పై కేటీఆర్ మండిపడ్డారు.. గుర్తు పెట్టుకోండి. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని వెల్లడించారు.. అనంతరం జై కిసాన్.. జై తెలంగాణ అంటూ ముగించారు..