తల్లిపై ప్రేమతో చాలా మంది బహుమతులు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కొందరు ఖరీదైన వస్తువులను, మరికొందరు వారికి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి వారి సంతోషాన్ని కోరుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన తల్లిపై చూపిన ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన రౌనక్ గుర్జార్(Raunak Gurjar) అనే వ్యక్తి ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి ప్రేమను చాటుకున్నాడు.
తన తొడ భాగంలోని కొంత చర్మాన్ని డాక్టర్ల సమక్షంలో శస్త్ర చికిత్స చేయించుకుని తీయించాడు. అనంతరం ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు తీసుకెళ్లి చెప్పులు చేయించాడు. వాటిని తన తల్లికి బహుమతిగా అందించాడు. అయితే ఇలా చేయడానికి గల కారణాన్ని రౌనక్ గుర్జార్ తెలుపుతూ రామాయణ బోధనల స్ఫూర్తితో ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. పోలీసుల తూటాలకూ గాయపడ్డాడు.
శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు, భక్తితో స్పూర్తి పొందినట్లు తెలిపాడు. తాను క్రమం తప్పకుండా రామాయణాన్ని పారాయణం చేస్తానని, రాముడి పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రౌనక్ వెల్లడించారు. తన చర్మంతో చెప్పులు తయారు చేసినా కూడా తల్లి సేవలకు సరిపోదని రాముడు స్వయంగా చెప్పాడని వెల్లడించాడు. ఈ మాటలు తనలో ప్రతిధ్వనించాయని తెలిపాడు.
నా చర్మంతో పాదరక్షలు తయారు చేసి వాటిని మా అమ్మకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా, తన కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా ఈ పని చేసినట్లు తెలిపాడు. మార్చి 14, 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి చెప్పులు సమర్పించారు. వ్యాసపీఠంపై కూర్చున్న గురు జితేంద్ర మహారాజ్తో రౌనక్ త్యాగానికి తల్లితో సహా అక్కడ ఉన్నవాళ్లంతా ఈ ఘటనకు చలించిపోయారు.