ఎన్నికలు వచ్చాయంటే డబ్బులకు రెక్కలు వస్తాయి.. లోపలున్న బ్లాక్ మనీ అంతా బయటకి వస్తుందని తెలిసిందే.. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో అధికారులు అన్నిచోట్లా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.. ఇక తెలంగాణ (Telangana)లో సైతం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసిన తర్వాతే వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారు.. ఈ క్రమంలో రంగారెడ్డి (Rangareddy) జిల్లా, షాద్ నగర్ (Shad Nagar), రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా నగదుతో పాటు వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వనపర్తి నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న TS 08 Z 0098 అనే బస్సులో సోదాలు నిర్వహించగా జయదేవ్ అనే యువకుడి వద్ద 16 లక్షల 50వేల నగదు, ఐదున్నర కిలోల వెండి బయటపడింది. అయితే వాటికి సంబందించిన ఎలాంటి ఆధారాలు అతను చూపించక పోవడంతో.. వాటిని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు గజ్వేల్ పట్టణం, అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన TS 36 C 0198 కారులో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వీటికి కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో.. పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.. ఈ నేపథ్యంలో గజ్వేల్ సీపీ అనురాధ కీలక సూచనలు చేశారు.. ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని వెల్లడించారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో డబ్బులుంటే.. సరైన ధ్రువపత్రాలు చూపించాలని తెలిపారు..