పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. పలు కీలక అంశాలను ముందుకు తెస్తూ ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకొంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో మరో సున్నిత అంశాన్ని బీజేపీ తెర పైకి తెచ్చింది. ఇందిరా గాంధీ హయాంలో 1974లో కచ్చతీవు (Katchatheevu) దీవిని శ్రీలంకకు అప్పగించినట్లు ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు.
ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని.. ధనుష్కోడికి ఉత్తరాన ఇరవై మైళ్ల దూరంలో 285 ఎకరాల జనావాసాలు లేని వివాదాస్పద భూభాగాన్ని ఇందిరాగాంధీ (Indira Gandhi), శ్రీలంక (Sri Lanka)కు అప్పగించారని పేర్కొన్నారు.. ఈ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించిందన్నారు.. 1983లో లంక అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ద్వీపం భారతీయ తమిళ మత్స్యకారులు, లంక నావికాదళం మధ్య పోరాటాలకు యుద్ధభూమిగా మారిందని తెలిపారు..
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను ప్రమాదవశాత్తూ దాటడం వల్ల భారతీయుల జీవనోపాధి, ఆస్తులు, జీవితాలను కోల్పోయిందన్నారు.. అదేవిధంగా ఈ దీవిని భారత్కు లీజుకు ఇవ్వడానికి శ్రీలంక పరిపాలనను ఒప్పించవచ్చని సింహళీయ మత్స్యకారులు ఆందోళనలు ప్రారంభించారు. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం చాలా క్లిష్టంగా మారిపోయిందని మోడీ పేర్కొన్నారు..
అందుకే కాంగ్రెస్ (Congress)ను ఎప్పటికీ విశ్వసించడానికి విలులేదని అన్నారు.. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ కు ఉన్న గుణం.. ఇది 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (X)లో ప్రధాని తెలిపారు.. ఇదిలా ఉండగా 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కచ్చతీవు ద్వీపంపై నియంత్రణను శ్రీలంకకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది.
తాజాగా తమిళనాడులో ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) బీజేపీ (BJP) అధ్యక్షులు కె అన్నామలై ఆర్టిఐ దరఖాస్తు ద్వారా ఇందుకు సంబంధించిన కీలక వివరాలను రాబట్టారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు ఇది తెరపైకి రావడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.