బీసీలకు మంచి చేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ అనుకుంటూ ఉండడం నిజంగా అభినందనీయమని కుల సంఘాలు అభిప్రాయపడ్డాయి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం వైపు ఆలోచన చేస్తుందని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైనది.. కులగణన జరిగితే బడుగు బలహీన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందుతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు అని కుల సంఘాలు ప్రకటించాయి. బీసీలకు ఏమేమి చేస్తే మంచి జరుగుతుందో కూడా కుల సంఘాలు నిర్ణయించాయి.. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడానికి కుల సంఘాలు సిద్ధమయ్యాయి. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం దక్కేవరకు పోరాడాలని దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) పిలుపునిచ్చారు.
సమాజంలో బీసీలకు ఆత్మ గౌరవం దక్కాలంటే రాజకీయ అధికారమే పరిష్కారమని తెలిపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ (BJP)కి బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీ సంక్షేమ అవసరం లేదని ఆరోపించారు. అందుకే బీసీ ప్రతినిధులతో త్వరలోనే భారీ సమావేశం కూడా నిర్వహించనున్నట్లు కుమారస్వామి తెలిపారు.