లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మొదలు పెట్టారు.. అయితే ఈ ప్రచారంలో ఆయన మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ (Congress) నేతలు మండిపడుతున్నారు.. ఈ క్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) విమర్శలతో విరుచుకు పడ్డారు..
కరీంనగర్ (Karimnagar) దాకా పోయిన వ్యక్తి అక్కడే ఉన్న కాళేశ్వరాన్ని సందర్శిస్తే బాగుండేదన్నారు. ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలిందని మండిపడ్డ ఆయన.. అధికారం పొగానే రైతులు గుర్తుకు వచ్చి నీతులు వల్లిస్తున్నారని అన్నారు. పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ షార్ట్… అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ, అది అక్షరాల నిజమని పొంగులేటి పేర్కొన్నారు.
రైతు ప్రేమికుడిగా నటిస్తూ పర్యటనలు, ప్రకటనలతో ఉదరగొడుతున్న కేసీఆర్.. రైతులను, జనాలను పురుగులను చూసినట్లు చూసిన రోజులను మరచిపోయావా అని మండిపడ్డారు.. గతమూ, వర్తమానమూ అంతా నటన, అహంకారం నియంతృత్వం అవినీతిమయమే అని విమర్శించారు.. తొమ్మిదిన్నర యేండ్లు అధికార మదంతో తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడారని విమర్శించారు.
అది కోల్పోగానే, రాత్రికి రాత్రే ప్రజాప్రేమికుడిగా ఫోజు కొడుతున్న అహంకారవాధి అని దుయ్యబట్టారు.. వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపడానికి, ప్రతిపక్ష నేత శతవిధాల ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.. మొన్న నల్గొండ పర్యటన గానీ, నేడు కరీంనగర్ పర్యటన గానీ, ఇందులో భాగమే అని పేర్కొన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి రైతులను పావులుగా వాడుకోవడం భాదాకరమని అన్నారు..
తొమ్మిదిన్నర యేండ్లు సీఏంగా ఉన్న ఆయన ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే, ఏనాడు రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. కానీ నేడు కొత్త వేషం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదాల వల్లనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని ఆరోపించిన శ్రీనివాస రెడ్డి.. ఇందులో మా ప్రభుత్వానికి ఏ పాత్రా లేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముగిసిందని పేర్కొన్నారు.. వర్ష భావ పరిస్థితుల వల్లనే రాష్ట్రంలో కరువు కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి తెలియదా అని ఎద్దేవా చేశారు..