బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు.. జరిగిన అవినీతిపై కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ చేసినట్లు ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. అందులో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)పై పలు భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీపీవో రాధాకృష్ణ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మేడ్చల్ (Medchal) జిల్లా పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
జాతీయ రహదారికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిపిన మున్సిపల్ అధికారులు.. అందుకే కూల్చివేసినట్లు పేర్కొన్నారు.. ఇవి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలని స్థానికుల నుంచి సమాచారం. కాగా స్థానిక కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి సంబంధికుల అక్రమాలపై ఇప్పటి వరకు చాలా దాడులు జరిగాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.. కేసులు సైతం నమోదు అయ్యాయి.. వాటిల్లో అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు చర్యలకు సిద్దం అయ్యారు..
ఇందులో భాగంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలు కట్టారని, ప్రభుత్వానికి చెందిన భూమిలో రోడ్డు వేశారని తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలకు దిగారు.. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన కళాశాల శాశ్వత భవనాలను సైతం అధికారులు ఇదివరకే కూల్చి వేసిన సంగతి తెలిసిందే..