ఒక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ (BJP) భావిస్తుంది.. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది. కానీ బీజేపీ ఎమ్మెల్యే, హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజాసింగ్ (Raja Singh) ఎక్కడ కనిపించడం లేదు.. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.. మూడవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పలు రకాల కారణాలతో బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ గా రాజాసింగ్ కు అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ఆ బాధ్యతలు అప్పగించడంతో పార్టీపై గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్, జహీరాబాద్, నాందేడ్ లతో పాటు కర్నాటక లోని ఓ పార్లమెంట్ నియోజకవర్గంలలో ఏదైనా ఒక చోటు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది.
కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెలల వ్యవధి నుంచి ఆయన పార్టీకి అంటిముట్టకుండా ఉండటం కనిపిస్తుందనే చర్చ మొదలైంది.. అయితే ఈ పరిస్థితులన్నీ రాబోయే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గమైన గోషామహల్ లో ఇటీవల పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించినా హాజరు కాలేదు.
ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించగా దానికి కూడా గైర్హాజరు అయ్యారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టక పోవడంతో రెండవ క్యాడర్ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి అంశాలు పరీక్షగా గమనిస్తే.. రాబోయే కాలంలో రాజాసింగ్ బీజేపీలో ఉంటారా? అనే అనుమానాలు కలుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఉన్నా పార్టీ కార్యకర్తగా మాత్రమే ఉండవచ్చని అనుకొంటున్నారు..