Telugu News » Eleti Maheshwar Reddy : ఆర్ఆర్ దందా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

Eleti Maheshwar Reddy : ఆర్ఆర్ దందా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ట్రస్ట్ ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అడిగితే పక్కన పెట్టాల్సిన ప్రభుత్వం అన్ని పర్మిషన్స్ ఇచ్చేసింది.

by Venu
No clarity in Congress on Khammam's candidate.. Another new name on the screen?

– మరోసారి తెరపైకి హెటిరో భూ వివాదం
– రూ.5 వేల కోట్ల ఆమ్దానీ వచ్చే ల్యాండ్ అగ్గువకే ఇచ్చేసిన బీఆర్ఎస్ సర్కార్
– ట్రస్ట్ పెట్టిన ఏడాదికే 15 ఎకరాల భూ కేటాయింపు
– అది కూడా రూ.30 లక్షలకే అప్పగింత
– ప్రభుత్వం మారడంతో లీజుకు బ్రేక్
– జీవో వెనక్కి తీసుకున్న రేవంత్ సర్కార్
– కానీ, సైలెంట్ గా దందా నడిపినట్టు ఆరోపణలు
– అధికారికంగా ఎకరం 15 లక్షలకు అప్పగింత
– తెర వెనుక రూ.300 కోట్ల దందా
– బీజేఎల్పీ నేత ఏలేటి తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ హయాంలో హెటిరో భూ వివాదం ఓ రేంజ్ లో కొనసాగింది. ఈ పంచాయితీ హైకోర్టు వరకు చేరింది. అయితే, తాజాగా మరోసారి ఈ ల్యాండ్ లడాయి తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెటిల్‌మెంట్ల కోసమే ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా దగ్గర పెట్టుకొని మళ్లీ రీ సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబోడ్డున ఉన్న 15 ఎకరాల స్థలాన్ని హెటిరో డ్రగ్స్ పార్థసారధికి ఇచ్చిందని తెలిపారు. 15 వందల కోట్ల విలువైన ఆ భూమిని కేవలం ఎకరం 2 లక్షల లీజ్ చొప్పున జీవో నెంబర్ 12 ఇస్తే.. దాన్ని రద్దు చేసిన రేవంత్ సర్కార్ అది ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టిందని తెలిపారు. అయితే, మళ్లీ అదే హెటిరోకు ఆ భూమిని జీవో నెంబర్ 37 ద్వారా కేటాయించిందని ఆరోపణలు చేశారు.

ఈ భూమి దారాదత్తం చేయడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయని అన్నారు. సదరు సంస్థ నుంచి 300 కోట్లు తీసుకొని రవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన ఆరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్ మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనులు చేయడానికేనా గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు ఆధారాలు బయటికి తీసేదని మండిపడ్డారు. సెటిల్ మెంట్ల కోసమేనా కాళేశ్వరం ఇష్యూపై నోరు మెదపట్లేదని విమర్శించారు. సూడో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో సొంత మనుషులతో సెటిల్ మెంట్లు చేయిస్తున్నారని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి.. ఇంకొన్ని ఆధారాలతో మరో రెండు రోజుల్లో మీడియా ముందుకి వస్తానని పేర్కొన్నారు.

అసలేంటీ వివాదం?

హెటిరో కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్ లో సాయిసింధు ఫౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్  ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్ నగర్లో క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ ఏర్పాటుకు 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని అప్పటి సీఎం కేసీఆర్ ను కోరారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ట్రస్ట్ ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అడిగితే పక్కన పెట్టాల్సిన ప్రభుత్వం అన్ని పర్మిషన్స్ ఇచ్చేసింది. ఇజ్జత్నగర్ బదులు ఖానామెట్లో ప్లేస్ ఇవ్వాలని ప్రభుత్వం ఫైళ్లు మార్పించింది. ఆ ట్రస్ట్కు  స్థలం కేటాయించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ వేయటం.. ఖానామెట్లో సర్వే నెంబర్ 41/41లో 15 ఎకరాల స్థలం ఇవ్వాలని సీసీఎల్ఏ కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టాప్ ప్రయారిటీ ఆదేశాలివ్వటం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజు కుదిరింది. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు 2023 జూన్‌ 5న తుది తీర్పునిస్తూ జీవో 59ని రద్దు చేసింది. భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీవో 218ను పునఃసమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోమారు లీజు నిబంధనలను సవరించిన బీఆర్ఎస్ సర్కార్  2023 ఆగస్టు 11న జీవో-99 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే.. 2023 సెప్టెంబరు 25న జీవో 140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

విలువైన భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్.. కానీ!

గత ప్రభుత్వ హయాంలో ధారాదత్తం చేసిన భూములపై రేవంత్‌ ప్రభుత్వం రాగానే దృష్టి సారించింది. జీవో 59 కింద ఆమోదించిన దరఖాస్తులపై ఫోకస్ పెట్టి, శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా అవన్నీ అక్రమబద్ధీకరణలు అని తేల్చింది. వెయ్యి దాకా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను నిలిపివేసింది. ఈ క్రమంలోనే పార్థసారథిరెడ్డి ట్రస్టుకు కట్టబెట్టిన భూములపై దృష్టి సారించింది. అయితే, అదే హెటిరోకు ఆ భూమిని జీవో నెంబర్ 37 ద్వారా కేటాయించిందని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు మారినట్టు బీజేపీ విమర్శలు చేస్తోంది.

You may also like

Leave a Comment