కారు షెడ్డుకు.. హస్తం అధికారం వైపు అని కాంగ్రెస్ నేతలు స్పీడ్ లో దూసుకువెళ్తుండగా.. కేటీఆర్ వాటికి బ్రేక్ లు వేస్తున్నట్లు ఈ మధ్య తరచుగా ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతుండటం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

పార్లమెంట్ ఎన్నికలు ముగిసేలోగా ఎంత తిరగాలో అంత తిరగండి అని పేర్కొన్న ఆయన.. ఎన్నికలు అయ్యాక ఇక బాదుడే అని కీలక వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది. కానీ రైతులకు ఇప్పటి వరకు రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు.. అదీగాక రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీటి ఎద్దడి మొదలైనట్లు ఆరోపించారు..
సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ కంటికి రెప్పలా కాపాడుకొందని తెలిపిన కేటీఆర్.. బీసీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చామని వెల్లడించారు.. కేసీఆర్ దళితుల కోసం చేసినన్నీ కార్యక్రమాలు దేశంలో మరే నేత చేయలేదని వ్యాఖ్యానించారు.. అలాగే కుల వృత్తులకు సైతం ఆసరాగా నిలిచిందని వివరించారు..