దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. ప్రధాన పార్టీలకైతే ఈ సంగ్రామం చావో రేవోగా మారింది. అందుకే పార్టీలు అందివచ్చిన ప్రతి అంశాన్ని అస్త్రంగా మలచుకొని కదనరంగంలోకి దూకుతున్నాయి.. మరోవైపు తెలంగాణ (Telangana)లో ప్రధాన పార్టీల పరిస్థితి ఉత్కంఠంగా మారింది. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. ఇదే సమయంలో సర్వేల జోరు పెరుగుతోంది.
రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి సర్వే సంస్థల వరకు రంగంలోకి దిగాయి.. రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనే దానిపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటికి అనుగుణంగా అంచనాకు వస్తున్నాయి.. అయితే తాజాగా జన్ లోక్ పోల్ (Jan Lok Poll), న్యూస్ ఎక్స్ (News Ex) సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ (Opinion polls)ఫలితాలు ఆసక్తిగా మారాయి.
ఈ సర్వేల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ (BJP) రోజురోజుకూ బలపడుతున్నట్టు వెల్లడించడంతో ఆ పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 9-10 స్థానాల్లో గెలవబోతున్నదని జన్ లోక్ పోల్ లేటెస్ట్ సర్వేవెల్లడించింది. అధికార కాంగ్రెస్ 7-8 స్థానాలు, ఇతరులు 0-1 స్థానంలో గెలవబోతున్నట్లు అంచనా వేసింది.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు సేకరించిన ప్రజాభిప్రాయంలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. మరోవైపు న్యూస్ ఎక్స్ విడుదల చేసిన ఒపీనియన్ పోల్ ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మెజార్టీ స్థానాలు అధికార కాంగ్రెస్ (Congress)కి దక్కే అవకాశం ఉన్నా, బీజేపీ సైతం రేస్‌లో దూసుకువస్తున్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
అదేవిధంగా బీఆర్ఎస్ (BRS)కు గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 5, బీఆర్ఎస్‌కు 3 ఎంఐఎంకు ఒక స్థానం దక్కబోతున్నట్లు న్యూస్ ఎక్స్ సర్వే అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ ఓట్ షేర్ బీజేపీకి సానుకూలంగా మారుతున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి..