ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఇప్పట్లో జైలునుంచి బయటికి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఆమె జైలు నుంచి బయటికి రప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించడంలేదు. ఈ కేసులో కవిత పాత్ర కీలకంగా ఉందని ఈడీతో పాటు సీబీఐ బలమైన ఆధారాలు చూపించిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టుల్లో ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
మంగళవారం నాటితో సీబీఐ, ఈడీ కస్టడీ ముగియడంతో ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈసారి కవిత విషయంలో ఎలాంటి కొత్త విషయాలను ఈడీ, సీబీఐ అధికారులు జతచేయలేదు. మరోవైపు.. కవిత కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరపు లాయర్ వాదించినప్పటికీ.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని కాబట్టి మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.
సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారన్న విషయాన్ని మరోసారి కవిత లాయర్ కోర్టుకు వివరించారు. ఈడీ, సీబీఐ అధికారులు చెప్పినవే చెబుతూ చెబుతున్నారని కొత్త చెప్పిందేమీ లేదని కవిత లాయర్ న్యాయమూర్తికి చెప్పారు. ఈ వాదనల అనంతరం కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు కోర్టుకు అందజేశారు.
ఇలా ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత కస్టడీకి అనుమతించింది. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరగా కోర్టు అనుమతిచ్చింది. మే-07 తారీఖు వరకు కవిత కస్టడీలోనే ఉండనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కవితను మళ్లీ తీహార్ జైలుకు సీబీఐ అధికారులు తరలిస్తున్నారు. మరో 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై త్వరలోనే చార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ చెబుతోంది.