టీఆర్టీసీ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య వివాదం తలెత్తింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి వీలు కల్పిస్తున్న బిల్లును ప్రభుత్వం.. గవర్నర్ కి పంపగా.. దీనిపై మరిన్ని వివరణలు అవసరమని, దీనిపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉందంటూ రాజ్ భవన్ .. ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను గవర్నర్ తమిళిసై తిప్పి పంపడంతో ఆగ్రహంతో ఉన్న సర్కార్.. ఈ తాజా పరిణామంతో మరింత నిప్పులు కక్కింది. గవర్నర్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో శాసనసభలో దీనికి ఆమోదముద్ర వేయించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే రాజ్ భవన్ నుంచి ఇంకా ఎలాంటి ఆమోద సంకేతాలు రాలేదు.
బహుశా ఈ బిల్లు విషయంలోనే కావచ్చు ..అసెంబ్లీ సమావేశాలను మరోరోజు వరకు.. అంటే రేపటివరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగా బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోద ముద్ర రావచ్చునని ఆశిస్తోంది. నిజానికి మూడు రోజులపాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినా.. మరో రోజు వరకు పొడిగిస్తున్నారు.
రెండు గంటలపాటు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
బస్సు బిల్లుపై గవర్నర్ వైఖరికి నిరసనగా శనివారం ఉదయం తెలంగాణ వ్యాప్తంగా రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు రోడెక్కలేదు. బస్సు డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు, కాలేజీ, స్కూలు విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా బస్సులు నిలిచిపోవడానికి కారణాలు తెలియవని కొందరు ప్రయాణికులు చెప్పారు. వీరి అవసరాలను ఆసరాగా తీసుకున్న ప్రైవేటు వాహనాలు, ఆటోలు, ఓలా వంటివి చార్జీలను విపరీతంగా పెంచేశాయి. తమ ప్రయోజనాలను ఉద్దేశించి ప్రభుత్వం తెచ్చిన బిల్లు పట్ల గవర్నర్ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు శనివారం రాజ్ భవన్ వరకు నిరసన ర్యాలీ చేబట్టాలని నిర్ణయించారు.