ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(Vijayawada) కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వైభవంగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సేవలో పాల్గొనే అర్చక స్వాములు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసు యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని అర్చకస్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్చక స్వాముల కుటుంబాలకు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదంటూ వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు వెనక్కి పంపిస్తుండడంతో అర్చక స్వాములు ఇబ్బందిపడుతున్నారు. అర్చకులపై పోలీసులు దురుసుగా మాట్లాడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్చకులను నువ్వు.. ఏంటి.. అని ఏకవచనంతో పోలీసులు సంబోధిస్తున్నారు.
365 రోజులు అమ్మవారికి సేవ చేసుకునే తమకు తగిన గౌరవం కూడా ఇవ్వడంలేదని అర్చకులు వాపోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శన భాగ్యం లేదా? అని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం వారి కుటుంబసభ్యులను అమ్మవారి దర్శనానికి ఎలా తీసుకొస్తున్నారని అర్చక స్వాములు ప్రశ్నిస్తున్నారు.