అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది నేతల మధ్య మాటల యుద్ధం కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకొంటూ ఉండగా తాజాగా గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే (MLA) రాజాసింగ్ (Raja Singh), అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కి దమ్ముంటే నా మీద పోటీ చేయాలని సవాల్ విసిరారు. పోటీకి నీవు వస్తావా? మీ తమ్ముడు వస్తాడా? రండి మీకు ఒక్క ఓటు కూడా పడనీయనని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy)అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీకి లేదని.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర వాళ్ళది అంటూ రాజా సింగ్ విమర్శించారు. ఈ మధ్యకాలంలో అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు ఎంఐఎం (MIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని రాజా సింగ్ విరుచుకుపడ్డారు.
నా మాటలకు ముస్లింలు ఓట్లు వేయకపోయినా ఫర్వాలేదు. వాళ్ళ ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని అన్నారు. గోషామహల్లో ఓవైసీ అభ్యర్థులతో బిజినెస్ చేస్తాడని, ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలో ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచే డిసైడ్ అవుతుందని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ముకేష్ గౌడ్ కు మద్దతు ఇచ్చేందుకు 2014 ఎన్నికల్లో ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు రాజా సింగ్ . 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని దారుసలేం నుంచి డిసైడ్ చేసిండని, 2023 ఈ ఎన్నికల్లో కూడా దారుసలెం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు..