అమెరికా పౌరసత్వాల్లో భారతీయులు రికార్డు నెలకొల్పారు. అక్కడ పౌరసత్వం పొందిన వారిలో రెండో స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధికంగా పౌరసత్వం పొందిన వారంతా మనవాళ్లే. ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్ షిప్ (Naturalisation citizenship) లభించింది. 2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు.
తర్వాత ఇండియా (65,960), ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038 ) ఉన్నాయి. అమెరికా సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం ఐదేళ్ల పాటు ఎల్‌పీఆర్‌లు అయి ఉండాలి. హోండురస్, గ్వాటిమాలా, వెనిజువెలా, మెక్సికో, ఎల్ సాల్వెడార్, బ్రెజిల్ వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్థాన్ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.
2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ (ఎల్‌పీఆర్) ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని స్వతంత్ర ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS)’ తెలిపింది. సహజీకృత పౌరసత్వం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2023 ముగిసే నాటికి 4,08,000గా ఉన్నట్లు సీఆర్ఎస్ నివేదిక పేర్కొంది. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎలీఆర్ ఉన్నవారు నేచురలైజేషన్ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మంది వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని నివేదిక తెలిపింది.
అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివాసముంటున్నారు. 33.3 కోట్ల అగ్రరాజ్య జనాభాలో ఇది 14 శాతానికి సమానం. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా (Naturalised citizens) పిలిపించుకున్నారు. మొత్తంగా ఆ ఏడాదిలో 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారని నివేదిక వెల్లడించింది. అయితే, భారత్‌లో పుట్టి అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్ఎస్ నివేదిక తెలిపింది.