తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనంగా మారిన పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పటి వరకి ఒక కొలిక్కి రాలేదన్న విషయం తెలిసిందే. ఎందరో నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన, టీఎస్పీఎస్సీ (TSPSC)వల్ల, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు..
అయితే రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ్ భవన్ అధికారులు స్పందించారు.. జనార్దన్ రెడ్డి రాజీనామాకు ఇంకా ఆమోదం లభించలేదని వెల్లడించారు.. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరిలో ఉన్నారని, జనార్దన్ రెడ్డి రాజీనామా పరిశీలనలోనే ఉందని స్పష్టతనిచ్చారు..
అయితే పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించవద్దని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ డీవోపీటీకి తమిళిసై లేఖను సైతం రాసినట్లు సమాచారం. మరోవైపు జనార్దన్ రెడ్డి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు రిజైన్ లెటర్ పంపించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారని ప్రచారం జరిగింది.
అయితే రాష్ట్రంలో కేసీఆర్ (KCR) సర్కార్ ఓటమికి ప్రధాన కారణంగా టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్ అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ నిర్వహించిన పలు పోటీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..