ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన (Janasena) కలసి బరిలోకి దిగుతుండగా.. బీజేపీ (BJP)తో సైతం జతకట్టాలని భావిస్తున్న ఈ రెండు పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.. ఇక తాజాగా అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. నేడు అమిత్‌షా నివాసంలో సమావేశమైన చంద్రబాబు, పవన్, ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
ఈ మేరకు ఎన్డీఏ (NDA)లోకి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీ (TDP) హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని భావిస్తున్న టీడీపీ, ఎన్టీఏలో చేరడానికి సిద్దం అయిందని అంటున్నారు.. మరోవైపు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సైతం 3 పార్టీలకు అవగాహన కుదిరిందని సమాచారం.
అదేవిధంగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయావకాశాల ఆధారంగా ముందుకెళ్లాలని మూడు పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయనతో కలిసి పనిచేయడానికి బీజేపీ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ (PM Narendra Modi) మూడోసారి అధికారం చేపడతాననే ధీమాతో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని సంకల్పించుకొని నీతీశ్ కుమార్ లాంటి పాతమిత్రులను కలుపుకెళ్లాలని నిర్ణయించారని అంటున్నారు..
అందుకే చంద్రబాబునూ ఆహ్వానించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పొత్తులపై 3 పార్టీల నేతలు ఇప్పటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భేటీతో క్లారిటీ వచ్చినట్లు భావిస్తున్న క్రమంలో త్వరలోనే ఈ అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.