కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ఎన్డీఎస్ఏ (NDSA) నిపుణుల కమిటీ ఇవాళ జలసౌధ (Jalasauda)లో సమావేశం నిర్వహించిది. ఈ సమావేశానికి ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు, రిటైర్డ్ అధికారులు అందరూ హాజరు కావాలని స్పష్టం చేసింది. వీరందరితో ప్రాజెక్టుపై చర్చించిన అనంతరం ఢిల్లీ (Delhi) వెళ్లనుంది.
మేడిగడ్డ సహా అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) ఆనకట్టలపై అధ్యయనం కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ, రెండు రోజుల పాటు మూడు ఆనకట్టలను పరిశీలించింది. ఆనకట్టలకు సంబంధించిన పరీక్షలు, డిజైన్స్, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ అంశాలపై అధ్యయనం చేసింది. మేడిగడ్డ ఆనకట్టలో (Medigadda) కుంగిన పియర్స్, పగుళ్లు, దెబ్బతిన్న ప్రాంతాల్ని పరిశీలించింది.
అన్నారం ఆనకట్టలో సీపేజీ వచ్చిన ప్రాంతంతో పాటు సుందిళ్ల ఆనకట్టను కూడా ఈ బృందం పరిశీలించారు. అనంతరం నేడు హైదరాబాద్ జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలతో సమావేశమయ్యారు. 2016 నుంచి ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజినీర్లను, బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన వారు కూడా సమావేశానికి రావాలని స్పష్టం చేశారు.
ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన బృందం, ఆనకట్ట కుంగుబాటుకు ఏమేరకు ఉందన్నదీ నిశితంగా పరిశీలించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి, 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేశారు.మరోవైపు ఎన్టీఎస్ఏ కమిటీ బ్యారేజీలో స్థితిగతులపై, మరమ్మతుల సాధ్యసాధ్యాలపై నాలుగు నెల్లలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కాగా ప్రాథమిక నివేదిక ఆధారంగానే మరమ్మతులతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..