ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించే ముచ్చటించుకొంటున్నారు. అయితే కొందరికి మాత్రం జీరో బిల్లులు రావడం లేదు. గతంలో వచ్చినట్లుగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. బిల్లులు వచ్చిన వారు.. తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లుల కాపీలతో ఎంపీడీవో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపిన భట్టి.. తెలంగాణలో కరెంటు డిమాండ్ బాగా పెరిగిందని.. రాష్ట్రంలో కరెంటు కష్టాలు రాబోతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అపోహాల్ని నమ్మోద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా గత ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ (Congress) వస్తే కరెంటు ఉండదని మభ్యపెట్టే ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.. వారికంటే ఇప్పుడే కరెంట్ సరాఫరా బాగుందని అన్నారు..
మరోవైపు గత ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఎక్కుడ కరెంట్ డిసెంబర్ నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపిన డిప్యూటీ సీఎం.. 2022 డిసెంబర్ లో 200 మిలియన్ యూనిట్లు వాడితే, 2023 డిసెంబర్ 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని వెల్లడించారు. ఇక కరెంట్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రజలంతా నిశ్చింతగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ఎంత డిమాండ్ ఉన్నా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ నెలలో 200 యూనిట్లలోపు ఉన్న వారికి బిల్లు వస్తే వారు ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని భరోసా భట్టి ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులో వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని, ఆ బిల్లుతో పాటు రేషన్ కార్డు తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ నందు నమోదు చేయించుకుంటే జోరో బిల్లు వస్తుందని తెలియజేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు నాలుగు పథకాలను ప్రారంభించారు.