2023 ఆసియా కప్(2023 Asia Cup)లో భారత్ మరోసారి పాక్ తో తలపడే ఛాన్స్ ఉందనే అంచనాలు ఊపందుకున్నాయ్. ఇప్పటికే భారత్-పాకిస్థాన్(India-Pakistan)జట్లు రెండు సార్లు తలపడ్డాయి.
లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వగా..సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్(Pakistan)పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు.
ఇక శ్రీలంకపై విజయంతో టోర్నీలో ఫైనల్ బెర్త్ ను కూడా ఖరారు చేసుకుంది భారత్. ఈ నేపథ్యంలో భారత్ పాక్ పై ముచ్చటగా మూడో సారి తలపడుతుందట. కారణమేంటంటే…సూపర్ 4(Super 4) దశలో రెండు వరుస విజయాలతో భారత్ 4 పాయింట్లతో టాప్లో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ రెండేసి మ్యాచ్లు ఆడి.. ఒక్కొక్కటి నెగ్గి వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక రెండు మ్యాచ్లు ఓడిన బంగ్లాదేశ్.. టోర్నీ నుంచి ఇంటి దారి పట్టింది. అయితే సూపర్ 4 లో తరువాతి మ్యాచ్ పాకిస్థాన్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 14న గురువారం జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ను ఢీ కొడుతుంది.
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగులుతుంది.ఎందుకంటే మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అలా జరిగితే 3 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉంటాయి. కానీ పాక్ కంటే ఎక్కువ రన్రేట్ ఉన్న కారణంగా శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.
అందుకే పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే.. కచ్చితంగా మ్యాచ్ జరిగి శ్రీలంకపై నెగ్గాలి. అదే జరిగితే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ముచ్చటగా మూడోసారి ఇండోపాక్ మ్యాచ్ను చూడవచ్చనని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు.