అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) పందొమ్మిది రోజులు సమయం ఉందనగా.. తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఖమ్మం (Khammam) జిల్లా మాజీ ఎంపీ (EX MP) పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసంలో ఆదాయపన్ను శాఖ దాడులు కలకలం రేపాయి.. ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో వేకువజామున 3 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్‌ఆర్ ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు.. పొంగులేటి నివాసంలో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. కాగా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో అధికారులు మెరుపు దాడులు చేశారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులో క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎనిమిది వాహనాల్లో వచ్చి.. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి పొంగులేటితో సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఐటీ అధికారులు, హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని, నందగిరిహిల్స్‌లో ఉన్న పొంగులేటి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశవుతోంది. ఇక గతంలో పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ పార్టీతో విభేదించి కాంగ్రెస్ లో చేరారు..