అయోధ్యకి రాములోరు వచ్చేసారు. అంగరంగ వైభవంగా నేడు ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్షణం కోసం కోట్లాది మంది భారతీయులు రెండు దశాబ్దాలుగా ఎదురు చూసారు. ఎదురు చూసిన క్షణం రానే వచ్చిన తరుణంలో ఈ అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి. ఆయనెవరో కాదు పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి. ఈయన అయోధ్య ఉద్యమం సమయంలో, కోర్టు కేసుల విషయం ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పుడు.. ఈయన సహాయం చేసారు. అయోధ్య ఉద్యమం కోసం ఎంతగానో పోరాడిన విశ్వహిందూ పరిషత్ కు పుల్లారెడ్డి గారు ఉద్యమ సమయంలో కోశాధికారిగా పని చేసేవారు.
అయోధ్యకి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయపరమైన వివాదం రెండు దశాబ్దాలుగా కొనసాగింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన విశ్వహిందూ పరిషత్ (VHP) వివాద ఖర్చులు లక్షల్లో పెరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. వీహెచ్‌పీని రక్షించేందుకు పుల్లారెడ్డి ముందుకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పటి VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ రెడ్డి పుల్లారెడ్డిని కలవగా.. పుల్లారెడ్డి అప్పటికప్పుడు రెండు లక్షలు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం లోపు పది లక్షల రూపాయలను అందించారు..
ఇంకా అవసరం అయితే.. తన భార్య నగలైనా, యింటినైనా అమ్మడానికి సిద్ధమేనని తెలిపారు. తాను వీహెచ్‌పీకి కోశాధికారిగా పనిచేస్తున్నంత కాలం కేసును ఎదుర్కోవడానికి నిధుల కొరత ఉండదని సింఘాల్‌కు హామీ ఇచ్చారు. 1974లో RSS సంఘ్ చాలక్‌గా మారిన పుల్లా రెడ్డి 1980 నుండి 2007లో మరణించే వరకు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో VHP రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అశోక్ సింఘాల్ పదవీ విరమణ చేసిన తర్వాత, పుల్లారెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి VHP అంతర్జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టారు.