అయోధ్య (Ayodhya) రామ మందిరంలో 2400కిలోల భారీ గంట(Bell)ను ఏర్పాటు చేయనున్నారు . యూపీలోని ఇటావా జిల్లా జలేసర్ పట్టణంలో దీన్ని తయారు చేశారు. రూ. 24 లక్షల వ్యయంతో అష్టదాతువులతో ఈ గంటను తయారు చేశారు. ఈ భారీ గంట మంగళవారం రామ మందిరానికి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో ఇది అతి పెద్ద గంట అని చెప్పారు.
ఈ గంట తయారీలో 30 మంది వర్కర్ల టీమ్ పాల్గొంది. గంట తయారీకి బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తగరం, ఇనుము, పాదరసం మిశ్రమాలను ఉపయోగించారు. ఈ గంటను వ్యాపారవేత్త ఆదిత్య మిట్టల్ ఆలయానికి అందించారు. తన సోదరుడు వికాస్ మిట్టల్ 2002లో గుండె పోటుతో మరణించారని వెల్లడించారు.
ఈ గంటను ఆలయానికి తన సోదరుడు వికాస్ మిట్టల్ డొనేట్ చేయాలని అనుకున్నట్టు తెలిపారు. ఆ గంట ఆరు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు ఉంటుందని తెలిపారు. ఈ గంటను మోగిస్తే ఆలయం చుట్టూ 2 కిలో మీటర్ల పరిధి వరకు ఆ శబ్ధం వినిపిస్తుందని ఆదిత్య మిట్టల్ వివరించారు.
ఆలయ గంటల తయారీకి యూపీలోని ఇటావా ప్రాంతం చాలా ప్రసిద్ధి. ఆలయంలో గంటల ఏర్పాటు కోసం దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇస్తుంటారు. ఒక్క జలేసర్లోని సుమారు 300 కర్మాగారాలు ఈ క్రాఫ్ట్ కళకు అనుసంధానంగా పని చేస్తున్నాయి. 2002 అక్టోబర్ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఇటావాలో పర్యటించారు. అప్పుడు ఈ గంటను చూసి ‘సనాతన హిందు ధర్మం వాయిస్‌ను ఇది ప్రపంచమంతటా వినిపించేలా చేస్తుంది’ అని అన్నారు.