కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ (KCR) అండ్ ఫ్యామిలీ భారీ దోపిడీ చేశారని బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు.. తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని నిండా ముంచి.. దళితులను.. రాష్ట్ర ప్రజలను వంచించి.. కోట్లు కూడబెట్టుకొన్న కేసీఆర్ మాటలు వింటుంటే సిగ్గుగా ఉందని విమర్శించారు.. కరీంనగర్‌లో నేడు మీడియాతో మాట్లాడినా ఆయన.. హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టి తరిమిన కేసీఆర్‌కు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అబద్దాల పునాదుల మీద కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్ రగిలించి వందల మంది జీవితాలను బొందపెట్టిన ఆయనను.. ప్రజలు అసహ్యహించుకొంటున్న ఇంకా అబద్ధాలు చెప్పడం సమాజం సహించదని మండిపడ్డారు.. బొంకడం అలవాటు చేసుకొన్న కేసీఆర్ రాష్ట్రానికి.. ప్రజలకు చేసిన అన్యాయం తెలుసని విమర్శించారు..
అసలు బీఆర్ఎస్ (BRS)కు తెలంగాణకు సంబంధమే లేదని.. ఆ పార్టీ పేరులో తెలంగాణ పదమే లేదని అన్నారు.. రాష్ట్ర ప్రజలను పదేండ్లు మోసం చేసిన కేసీఆర్‌కు.. వారి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని బండి సంజయ్ మండిపడ్డారు.. అధికారంలో ఉన్న పదేళ్లలో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శలు గుప్పించారు. అవినీతి ఎక్కడ బయటకి వస్తుందో అనే భయం కల్వకుంట్ల కుటుంబంలో కనిపిస్తుందన్నారు..
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్దామనుకుంటే అడ్డుకొన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రెండు పిల్లర్లు కుంగిపోతే భూమి బద్దలు అవుతుందా అని కేసీఆర్ కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై బండి సీరియస్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం కేసీఆర్‌కు అంత చిన్న విషయమా అని ప్రశ్నించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిర్లక్ష్యం ఈ మాటలను బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు..