అయోధ్యలో రామ మందిర పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు మండిపడుతోన్నారు.. ఈ కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది కాదని, అయోధ్య రామయ్య అందరికీ దేవుడని.. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం విడ్డూరమని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు..
ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రామమందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానేకాదన్న బండి సంజయ్ (Bandi Sanjay).. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. పవిత్రమైన కార్యక్రమాన్ని తక్కువ చేసేలా చూడటం సరికాదని పేర్కొన్నారు.. రాజకీయం వేరు.. ఆధ్యాత్మికత వేరు అన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు..
మరోవైపు కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ (Congress).. మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు..
తాము అధికారంలోకి వస్తే.. ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డవారి నుంచి డబ్బును కక్కించి.. ప్రజలకు పంచుతామని తెలిపిన విషయాన్ని కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు.. బీఆర్ఎస్ అవినీతిని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బండి మండిపడ్డారు.. ఎన్నికల ముందు బీఆర్ఎస్ అవినీతిపై చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలని తెలిపారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు..