మాజీ సీఎం కేసీఆర్(KCR) మాట్లాడిన భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదరిశ, ఎంపీ అభ్యర్థి (MP) బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇన్నాళ్లు రైతులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బుద్ది వచ్చిందన్నారు.
కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో 11వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతన్నలు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా వారిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని విమర్శించారు. వరి వేస్తే ఉరే.. అని చెప్పిన కేసీఆర్ సన్నరకం వడ్లను వేయమని చెప్పి రైతులను ఆగం చేశారని అన్నారు.
గతంలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతుకు డబ్బులు ఎందుకివ్వలేదని, రూ.లక్ష రుణమాఫీ హామీ ఏమైందన్నారు. ఫసల్ బీమా కాదని సమగ్ర పంటల బీమా తీసుకొస్తామని ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. రైతులను డీఫాల్టర్‌గా మార్చిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. ఇటు రైతుబంధు ఇచ్చినట్టే ఇచ్చి అటు సబ్సిడీలను ఎత్తివేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్ హయాంలోనే 18లక్షలున్న బోరుబావుల సంఖ్య 28లక్షలకు పెరిగిందన్నారు.
రైతుల బతుకులని నాశనం చేసి ఇప్పుడు మళ్ళీ రైతుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీ అధికారంలోకి వచ్చాక ఆచరణలో ఏమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టి ఆయన ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. నయీం కేసులో దొరికిన డబ్బంతా కేసీఆర్ వద్దే ఉందని తెలిపారు. ఆ డబ్బుతో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చని సలహా ఇచ్చారు.
అధికారులు కేసీఆర్ కుటుంబానికి బానిసల్లా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి బానిసలుగా మారొద్దని హితవు పలికారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పుడు తుక్కుగూడలో మరికొన్ని హామీలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. అసలు కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. ఆ పార్టీ ఇప్పటికే కుక్కలు చింపిన విస్తరాకులా తయారైందని ఆరోపించారు.
అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు నిందితులైన కేసీఆర్ కుటుంబంపై చర్యలేవన్నారు. తన ఫోన్‌నూ ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ తెలిపారు. తాము కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ఎలా తెలిశాయన్నారు. కచ్చితంగా ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం హస్తముందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని సూచించారు.